Chiranjeevi-Movies Biography News Age

Chiranjeevi megastar

పూర్తి పేరు: కొణిదెల శివ శంకర వరప్రసాద్ (చిరంజీవి)
జననం:1955 ఆగస్టు 22
భార్య: సురేఖ
తల్లి: అంజనా దేవి
తండ్రి: వెంకటరావు
పిల్లలు: సుస్మిత,రామ్ చరణ్ తేజ్,శ్రీజ

chirajeevi

జననం, విద్యాభ్యాసం:

చిరంజీవి 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నాడు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశలో చిరంజీవి ఎన్.సి.సిలో చేరి 1970వ దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పెరేడ్ లో పాల్గొన్నాడు. చిన్నతనం నుంచి నటనమీద ఆసక్తి ఏర్పడింది. ఒంగోలు లోని సి.ఎస్.ఆర్ శర్మ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. నరసాపురంలోని శ్రీ వై.ఎన్. కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నడు. తర్వాత 1976లో చెన్నై వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరాడు.1980 ఫిబ్రవరి 20 న చిరంజీవి వివాహం హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది.వారికి ఇద్దరు కుమార్తెలు సుస్మిత, శ్రీజ, ఒక కుమారుడు రాంచరణ్ తేజ.

సినీ ప్రయాణం:

చెన్నై లోని మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాది రాళ్లు చిత్రం చిరంజీవి నటించిన మొదటి చిత్రం. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1,116 రూపాయలు. బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు చిత్రం చిరంజీవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునిచ్చింది. తాయారమ్మ బంగారయ్య చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించాడు. ఐ లవ్ యు (1979)లో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించాడు. కె. బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన ఇది కథ కాదు చిత్రంలో ప్రతినాయకుడిగా నటించాడు. ఇంకా మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, 47 రోజులు, న్యాయం కావాలి, రాణువ వీరన్ వంటి చిత్రాలలో చిన్న పాత్రలు, ప్రతినాయక పాత్రలు పోషించాడు.

1982 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి చిత్రాలతో చిరంజీవి ప్రధాన కథానాయకుడిగా నటించడం ప్రారంభమైంది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది. తర్వాత కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వరకట్న దురాచారం మీద వచ్చిన శుభలేఖ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో నటనకు గాను చిరంజీవికి ఉత్తమ నటుడిగా తెలుగు ఫిల్మ్ ఫేర్ బహుమతి అందుకోగా, కె. విశ్వనాథ్ కి ఉత్తమ దర్శకుడిగా తెలుగు ఫిల్మ్ ఫేర్ బహుమతి దక్కింది. 1983లో ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించి చిరంజీవికి స్టార్ డం సాధించి పెట్టింది. తర్వాత ఇది పెళ్ళంటారా, సీతాదేవి, టింగురంగడు, బంధాలు అనుబంధాలు, మొండిఘటం మొదలైన చిత్రాల్లో నటించాడు. తర్వాత పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా, మంచు పల్లకీ లాంటి చిత్రాల్లో నటించాడు.

1984 లో మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవిదొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, లాంటి విజయవంతమైన యాక్షన్ సినిమాల్లో నటించాడు. 1985 లో చిరంజీవికి విజేత చిత్రంలో నటనకు రెండవసారి ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1986లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి చిత్రంలో హాస్యప్రధానమైన పాత్ర పోషించాడు చిరంజీవి.
1987 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయంకృషి చిత్రంతో చిరంజీవి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది బహుమతి అందుకున్నాడు. పసివాడి ప్రాణం (1987), యముడికి మొగుడు (1988), మంచిదొంగ (1988) బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. పసివాడి ప్రాణం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశాడు. 1988లో చిరంజీవి సహ నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి, నంది స్పెషల్ జ్యూరీ బహుమతి అందుకుంది. 1990లో అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేకవీరుడు అతిలోకసుందరి అనే ప్రయోగాత్మక సోషియో ఫాంటసీ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా నిలిచింది. అదే సంవత్సరంలో విడుదలైన కొండవీటి దొంగ 70MM, 6-ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ లో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రం.1991 లో వచ్చిన కొదమ సింహం, గ్యాంగ్ లీడర్ సినిమాలు చిరంజీవికి తెలుగు చిత్రపరిశ్రమలో సుస్థిరమైన స్థానాన్ని సాధించిపెట్టాయి. కొదమ సింహం చిత్రం ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలనచిత్రం.

చిరంజీవి బాలీవుడ్ లో నటించిన ప్రతిబంధ్ (1990), ఆజ్ కా గూండా రాజ్ చిత్రాలకు విశ్లేషకుల మెప్పు పొందారు. 1992 లో చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రెండో సారి నంది బహుమతి, ఫిల్మ్ ఫేర్ తెలుగు బహుమతి అందుకున్నాడు. 1996 లో సిపాయి అనే కన్నడ సినిమాలో అతిథి పాత్ర పోషించాడు చిరంజీవి. 1989 లో వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం తమిళంలో మాప్పిళైగా పునర్నిర్మితమైంది. ఇందులో రజనీకాంత్ కథానాయకుడిగా కనిపిస్తే, చిరంజీవి అతిథి పాత్రలో నటించాడు. 1990 దశకం మధ్య కాలంలో మెకానిక్ అల్లుడు, ఎస్.పి.పరశురాం, బిగ్ బాస్, రిక్షావోడు చిత్రాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ సమయంలో కూడా చిరంజీవికి నాలుగోసారి ఫిల్మ్ ఫేర్ సాధించి పెట్టిన ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్ళు, అల్లుడా మజాకా చిత్రాలు ఒక మోస్తరు విజయాలు సాధించాయి.కొంతకాలం తర్వాత హిట్లర్ (1997), మాస్టర్ (1997), బావగారూ బాగున్నారా, చూడాలని వుంది (1998), స్నేహం కోసం (1999) లాంటి చిత్రాలతో మళ్ళీ విజయాలబాట పట్టాడు. స్నేహం కోసం చిత్రంలో నటనకు గాను ఐదోసారి ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు.

కొత్త సహస్రాబ్దంలో చిరంజీవి కెరీర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్నయ్య (2000) చిత్రంతో ప్రారంభమైంది. 2001లో కన్నడ, తెలుగులో విడుదలైన ద్విభాషా ఆధ్యాత్మిక చిత్రం శ్రీ మంజునాథలో శివుడిగా నటించాడు. మంజునాథుడిగా అర్జున్ నటించాడు. ఇది కర్ణాటకలోని ధర్మస్థల మంజునాథేశ్వర స్వామి భక్తుడి నేపథ్యంలో తీసిన చిత్రం. కొంచెం వ్యవధి తర్వాత 2002లో వచ్చిన ఇంద్ర అప్పటి వరకు ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులు తిరగరాసింది. చిరంజీవికి ఉత్తమ నటుడిగా మూడోసారి నంది పురస్కారం, ఆరోసారి ఫిల్మ్ ఫేర్ బహుమతి దక్కింది. ఠాగూర్ సినిమా చిరంజీవిని తారాపథాన్ని అత్యుత్తమ స్థానానికి తీసుకువెళ్ళింది. దీని తర్వాత హిందీ చిత్రం మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్ రీమేక్ అయిన శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. చిత్రంలో నటించాడు. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఏడోసారి ఫిల్మ్ ఫేర్ బహుమతి అందుకున్నాడు. 2006 లో మురుగ దాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ చిత్రంలో నటించాడు. ఈ మూడు చిత్రాలు ఏదో ఒక సామాజిక ఇతివృత్తం ఉన్నవే. 2006 లో ఈయనకు ఫిల్మ్ ఫేర్ సౌత్ ప్రత్యేక బహుమతి అందజేసింది. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి.

2007లో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత సుమారు పదేళ్ల పాటు మరే సినిమాలో కథానాయకుడిగా నటించలేదు. ఈ సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ పదేళ్ళలో అడపా దడపా అతిథి పాత్రల్లో కనిపించాడు. 2009 లో కొడుకు రాం చరణ్ కథానాయకుడిగా వచ్చిన మగధీర, 2015లో వచ్చిన బ్రూస్ లీ చిత్రాల్లో కనిపించాడు. 2010 లో వచ్చిన వరుడు, 2015లో వచ్చిన రుద్రమదేవి చిత్రాల్లో నేపథ్య సంభాషణకు తన గాత్రం అందించాడు. 2013 లో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర చిత్రంలో శివుడిగా అతిథి పాత్రలో కనిపించాడు.

2013 నుంచే చిరంజీవి తిరిగి నటనారంగంలోకి ప్రవేశించడానికి సరైన కథ కోసం అన్వేషణ ప్రారంభించాడు. అది యాధృచ్చికంగా తన 150వ చిత్రం కావటం విశేషం. దాదాపు పది సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నెం.150, 2017 జనవరి 11 న విడుదల అయ్యింది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2017 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మంచి సమీక్షలనందుకుంది.

2019 లో చిరంజీవి తన మొదటి పీరియాడిక్ చిత్రం సైరా నరసింహారెడ్డిలో నటించారు. స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. 200 కోట్ల పైచిలుకు వ్యయంతో నిర్మించిన సైరా 240 కోట్లకు పైగా వసూలు చేసింది. 2022 లో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంతో తన కుమారుడు రామ్ చరణ్ తో కూడా నటించారు. 2022 లో మోహన రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది

Leave a Comment