Jigarthanda DoubleX Telugu Movie Review

JIGARATHANDA

నటీనటులు: రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో, నిమిషా సజయన్, బావ చెల్లదురై తదితరులు
ఛాయాగ్రహణం: తిరు
సంగీతం: సంతోష్ నారాయణన్
నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్, అలంకార్ పాండియన్
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు
విడుదల: నవంబర్ 10, 2023

జిగర్ తండా డబుల్ఎక్స్ అనే తమిళ సినిమా కూడా తెలుగులోకి డబ్బింగ్ అయి విడుదలైంది. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు, రాఘవ లారెన్స్ ఎస్ జె సూర్య కథానాయకులు. కార్తీక్ సుబ్బరాబు సినిమాలు అంటే యువతలో కొంచెం ఆసక్తి వుంది, దానికితోడు ఇదే దర్శకుడు ఇంతకు ముందు తీసిన జిగర్ తండా అనే సినిమా పెద్ద విజయం సాధించటంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కవగానే ఉన్నాయి.

ఈ జిగర్ తండా డబుల్ఎక్స్ ఎలా వుందో చూద్దాం.

RAGHAVA LARANCE

కథ:

పేరున్న ఒక పెద్ద నటుడు (షైన్ టామ్ చాకో) ముఖ్యమంత్రి కావాలని అనుకుంటాడు, కానీ అతనికి తన సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంటే, వాళ్ళని తొక్కేయాలని అనుకుంటాడు. అందుకు తన తమ్ముడు డీఎస్పీ (నవీన్ చంద్ర) సహాయం తీసుకుంటాడు, తనకి వ్యతిరేకంగా వున్న నాయకులని చంపేయమంటాడు. డీఎస్పీ జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్న నలుగురు ఖైదీలను ఎంచుకొని వాళ్ళకి ఈ చంపే పనిని అప్పగిస్తాడు. అందులో కృప (ఎస్ జె సూర్య) అనేవాడు సబ్ ఇనస్పెక్టర్ కావాలని అనుకొని, చెయ్యని హత్యకి జైలులో ఉంటాడు. రాజకీయ నాయకుల అండతో కర్నూలు మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్న అలియస్ సీజర్ (రాఘవ లారెన్స్) ని చంపే బాధ్యత కృపకి అప్పగిస్తాడు డీఎస్పీ.అతను తాను సత్యజిత్ రే దగ్గర పని చేసానని, తన పేరు రే దాసన్ అని చెప్పి సీజర్ దగ్గర చేరి, అతని సినిమా చెయ్యడానికి పూనుకుంటాడు. నలుపు రంగు వున్నవాళ్లు హీరో ఏంటి అని ఇంకో హీరో అవమానించడంతో తాను ఎలా అయినా హీరో అవ్వాలని అందుకు తన కథే మంచిదని దానికోసం రే దాసన్ ని దర్శకుడిగా ఎంచుకొని సినిమా మొదలెడతాడు సీజర్. అలాగే అతను హాలీవుడ్ నటుడు క్లింట్ ఈస్ట్ వుడ్ కి పెద్ద అభిమాని. రే దాసన్ ఏమో సీజర్ చనిపోవాలని చూస్తాడు, సీజర్ ఏమో సినిమా ద్వారా తాను ఏంటో నిరూపించాలని అనుకుంటాడు, షూటింగ్ మొదలు పెట్టాక కథ అడవుల్లోకి, ఆదివాసీలవేపుకి వెళుతుంది? సీజర్ బయోపిక్ పూర్తయిందా, ఎందుకు అడవులవేపు కథ మళ్లింది, రే దాసన్ తాను అనుకున్న పని పూర్తిచెయ్యగలిగాడా? డీఎస్పీ నేపధ్య కథ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ సినిమా చూడాల్సిందే.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కి మంచి దర్శకుడు అన్న పేరుంది. అతని సినిమాల కోసం ఎదురు చూసే ప్రేక్షకులు కూడా వున్నారు. అతను ఇంతకు ముందు తీసిన తీసిన ‘జిగర్ తండా’ సినిమా పెద్ద విజయం సాధించింది, దానికి ఈ ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ సీక్వెల్ గా వచ్చింది. ‘జిగర్ తండా’ లో డాక్యుమెంటరీలు తీసే అతను దర్శకుడుగా అవ్వాలని, ఒక రౌడీ నేపధ్యం వున్న సినిమా చెయ్యాలని అనుకుంటాడు. ఇందులో ఒక రౌడీ ని చంపడానికి దర్శకుడిగా అవతారం ఎత్తి ఆ రౌడీ గురించి సినిమా చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. రౌడీని చంపడమే ప్రధాన ఉద్దేశంగా దర్శకుడిగా వచ్చి, అతని బయోపిక్ మొదలెట్టి, చివరికి ఆ సినిమా ఎక్కడికి దారితీసింది అనేదే ఈ ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ ప్రధానమైన కథ. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు సినిమా మాధ్యమం అనేది ఎంత బలమైనదో ఈ రెండు సినిమాల ద్వారా చెపుతాడు.

‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ లో కార్తీక్ సుబ్బరాజు 1973 నాటి కథని ఎంచుకున్నాడు. నలుపురంగు వున్నవాడు హీరో ఎలా అవుతాడు అని సీజర్ అనేవాడిని ఎగతాళి చేస్తే, దానికి అతను చేసి చూపిస్తా అని అంటాడు. అప్పటికి రజనీకాంత్ ఇంకా హీరోగా ఎదగలేదు, అందుకని అప్పటి కథ ఎంచుకున్నాడు అనిపిస్తోంది. మొదటి సగం అంతా సూర్య, రాఘవ లారెన్స్ మధ్య చిన్న చిన్న సంఘటనలు, రాఘవ లారెన్స్ ఎలాంటి రౌడీ అనే విషయాలమీద ఉంటుంది. రెండో సగం రౌడీ కుటుంబం వేపు కథ ఉంటుంది, అది అడవికి తీసుకు వెళుతుంది, ఆదివాసుల గురించి చెప్తుంది. కార్తీక్ సుబ్బరాజు సినిమాల్లో కొంచెం సామాజిక అంశాలు కూడా ఉంటాయి. అడవులు, ప్రకృతి, అడవిలో జంతువులు, అడవిలో నివసించే ప్రజలు వారి పరిస్థితి ఇవనీ రెండో సగంలో ఉంటాయి. అయితే రెండో సగం అంతా కొంచెం భావోద్వేగంగా ఉంటుంది. మొదటి సగం అంతా వినోదాతాత్మకంగా ఉంటుంది. రెండో సగం కొంచెం డాక్యుమెంటరీ లా ఉంటుంది. తమిళ ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుందేమో కానీ, తెలుగు ప్రేక్షకులకి మాత్రం ఇది అంతగా నచ్చకపోవచ్చు.

ఇక నటీనటుల విషయానికి వస్తే:

ఎస్ జె సూర్య దర్శకుడు రే దాసన్ గా తన పాత్ర బాగానే చేసాడు. అలాగే రాఘవ లారెన్స్ కూడా రౌడీ సీజర్ గా చేసాడు. అయితే ఈ ఇద్దరి నటన పరవాలేదు అనిపించారు. కానీ తెలుగు ప్రేక్షకులకి అక్కడక్కడా ఓవర్ యాక్షన్ లా అనిపిస్తుంది. ఇందులో తెలుగు నటుడు నవీన్ చంద్ర ముఖ్యమైన పాత్రలో కనపడతాడు, అతను బాగా చేసాడు అని చెప్పాలి. మలయాళం నటుడు షైన్ టామ్ చాకో కూడా బాగానే చేసాడు. ఇక చాలా పాత్రలు తెలుగు ప్రేక్షకులకి అంతగా పరిచయం లేనివని చెప్పాలి, అందరూ వాళ్ళ పాత్రలకి తగ్గట్టుగా చేశారు. సంతోష్ నారాయణన్ నేపధ్య సంగీతం బాగుంది. అదే సినిమాకి హైలైట్ అని చెప్పాలి. అడవిలో కొన్ని పోరాట సన్నివేశాలు బాగున్నాయి. పాటలు అంతంత మాత్రంగా వున్నాయి.

చివరిగా జిగర్ తండా డబుల్ ఎక్స్’ సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ని అభిమానించే ప్రేక్షకులు ఈ సినిమా ఒక టైం పాస్ లా చూసుకోవచ్చు.

Leave a Comment